South Africa National Cricket Team players celebrate a wicket (Photo credit: X @ProteasMenCSA)

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులే అత్యధికమంటే బ్యాటర్లు ఎంత దారుణంగా విఫలమయ్యారో చెప్పవచ్చు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 140 పరుగుల వద్ద భారత్ కుప్పకూలింది. 408 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది.

ఈ విజయంతో 2‌‌–0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్‌ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్‌ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్ చేసింది.