Coronavirus Scare: కరోనావైరస్ ఎఫెక్ట్, రాజ్యసభ ఎన్నికలు వాయిదా, ఇటు ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా, ఎంసెట్ మరియు ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు పొడగింపు
మార్చి 26 నుంచి జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలను (Rajya Sabha Election) ఎన్నికల సంఘం వాయిదా వేసింది
New Delhi/ Amaravathi, March 24: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం మార్చి 26 నుంచి జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలను (Rajya Sabha Election) ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన 55 రాజ్యసభ స్థానాలకు గానూ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 37 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. పోటీ ఉన్న మిగిలిన 18 స్థానాలకు ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
10th Class Exams Postponed in Andhra Pradesh
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సి ఉన్న పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మళ్ళీ పరీక్షలు ఎప్పుడు అనేది మార్చ్ 31 తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంసెట్, ఐసెట్ ఆన్ లైన్ దరఖాస్తుల తేదీల గడువు కూడా పొడగిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా హైకోర్ట్ ఆదేశించడంతో ఆ రాష్ట్రంలో మార్చి 23 నుంచి మార్చి 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి, ఆ తర్వాత జరిగే పరీక్షలపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ ముందుగానే పరీక్షల వాయిదాను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పటికే 7కు చేరాయి. మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.