Hyderabad, March 20: టీఎస్ ఎస్ఎస్‌సీ (TS SSC Exams 2020)పరీక్షల విషయంలో హైకోర్ట్ కీలక ఆదేశాలు జారిచేసింది. కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ (High Court) శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. శనివారం జరగాల్సిన పరీక్షను మాత్రం యధావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది, ఆ తేదీ నుంచి ఏప్రిల్ 06 వరకు జరగాల్సి ఉన్న పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
తెలంగాణలో గురువారం నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. చాలా మంది విద్యార్థులు నిన్న ముఖాలకు మాస్కులతో పరీక్షకు హాజరయ్యారు. కరోనా వైరస్ దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటింది. పదో తరగతి పరీక్షలను మాత్రం యధావిధిగా కొనసాగిస్తామని పేర్కొంది. నిన్న అత్యవసర సమావేశం అనంతరం కూడా సీఎం పదోతరగతి పరీక్షలను కొనసాగిస్తామని చెప్పారు. 90% మంది పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలను పూర్తి చేయాలనే కోరుకున్నారని ఆయన వెల్లడించారు.
అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించిన హైకోర్ట్ ప్రస్తుతానికి మార్చి 23- మార్చి 30 వరకు ఉన్న పది పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్ట్ ఆదేశాల మేరకు మార్చి 23 నుంచి మార్చి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. శనివారం పరీక్ష యధాతథంగా జరగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు పదోతరగతి విద్యార్థులకు సెలవులు లభించినట్లయింది.