Coronavirus in India: మళ్లీ వణికిస్తున్న ఏవై.4 కరోనా వేరియంట్, మధ్యప్రదేశ్‌లో వ్యాక్సిన్ వేసుకున్న ఆరుగురికి పాజిటివ్, దేశంలో కొత్తగా 12,428 మందికి కరోనా, రష్యాలో ఒక్కరోజే 37,930 మందికి కోవిడ్
కొత్తగా కరోనాతో 356 మంది మరణించారు. తాజాగా 15,951 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 కరోనా యాక్టివ్ కేసులు (Active caseload stands at 1,63,816) ఉన్నాయి. రాష్ట్రాలు/యుటిలకు ఇప్పటి వరకు 107.22 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి.
New Delhi, Oct 26: దేశంలో గత 24 గంటల్లో 12,428 కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో 356 మంది మరణించారు. తాజాగా 15,951 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 కరోనా యాక్టివ్ కేసులు (Active caseload stands at 1,63,816) ఉన్నాయి. రాష్ట్రాలు/యుటిలకు ఇప్పటి వరకు 107.22 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. 12.37 కోట్ల కంటే ఎక్కువ డోస్‌లు ఇప్పటికీ రాష్ట్రాలు/యూటీల వద్ద అందుబాటులో ఉన్నాయlr భారత ప్రభుత్వం తెలిపింది.
ఇక ఏవై.4గా పిలుస్తున్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారే కావడం గమనార్హం. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది. ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బీఎస్ సాయిత్య తెలిపారు.
రష్యాలో కరోనావైరస్ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 37,930 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. మరో 1,064 మంది చనిపోయారు. మొత్తం 85 ప్రాంతాలకు గాను కొన్నింట్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గురువారం నుంచి నవంబరు 7 వరకు మొత్తం 11 రోజుల పాటు ఆంక్షలు కొనసాగించాలని ముందుగా భావించినా.. కొవిడ్ తీవ్రతతో ప్రారంభ తేదీని ముందుకు జరిపే వీలుందని, నవంబరు 7 తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉందని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇక, డెల్టా వేరియంట్ ప్రభావంతో చైనాలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఒకసారి, జూలై, ఆగస్టుల్లో ఓసారి డెల్టాతో కలవరపడిన చైనాలో.. మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది.
వారం రోజుల్లోనే 11 ప్రావిన్సులకు వైరస్ వ్యాపించింది. దీంతో పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించాలని చైనా నిర్ణయించింది. మూడేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దేశంలో స్థానిక వ్యాప్తి ద్వారా సోమవారం 38 కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది. ఇన్నర్ మంగోలియాలోనే 19 నమోదయ్యాయి. ఇక ఘాన్సులో నాలుగు కేసులు రికార్డయ్యాయి. పర్యాటకానికి పేరుగాంచిన ఈ ప్రావిన్సులో మొత్తం విహార కేంద్రాలను మూసివేశారు. కాగా, ఈ ప్రాంతం నుంచి వచ్చినవారితో కొద్ది రోజుల్లోనే 12 పైగా కేసులు రికార్డవడంతో బీజింగ్ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి విస్తృతం అవుతుండడంతో చైనావ్యాప్తంగా పర్యాటక రైళ్లను నిలిపివేశారు.