India's First Omicron Death: ఒమిక్రాన్ ఎఫెక్ట్, వెంటాడిన జ్వరం, దగ్గు, దేశంలో కొత్త వేరియంట్ తొలి మృతి నమోదు, రాజస్థాన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైందని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్ రాకతో మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. మరోవైపు భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు (India's First Omicron Death) ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Jaipur, Jan 6: దేశంలో ఒమిక్రాన్ కేసులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఒమిక్రాన్ రాకతో మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. మరోవైపు భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు (India's First Omicron Death) ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు జ్వరం, దగ్గు రావడంతో ఉదయ్ పూర్ లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 15న చేర్పించారు. డిసెంబర్ 21, 25 తేదీల్లో రెండు సార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగటివ్ అని తేలింది. డిసెంబర్ 31న ఆయన కన్నుమూశారు. మృతుడు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆయనకు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు.
ఆయన మృతిని కేంద్ర ఆరోగ్యశాఖ ఒమిక్రాన్ (Omicron Variant in Rajasthan) మరణంగా అధికారికంగా ప్రకటించింది. సాంకేతికంగా ఇది ఒమిక్రాన్ సంబంధిత మరణమని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మృతుడికి మధుమేహంతో పాటు, ఇతర సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తూనే, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వైద్యం అందించారని తెలిపారు.
ఒమిక్రాన్ టెస్టుకు ముందే మృతుడు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడ్డారని ఉదయ్ పూర్ చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ దినేశ్ తెలిపారు. మహారాణా భూపాల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మాట్లాడుతూ... అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే కోవిడ్ వార్డుకు తరలించామని చెప్పారు. ఆయనకు ఒమిక్రాన్ సోకిందంటూ డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా డిసెంబర్ 25నే మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా నెగెటివ్ వచ్చిందని... అయినప్పటికీ ఆయనను ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పారు. ఆయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమిస్తూ వచ్చిందని... డిసెంబర్ 31న మృతి చెందారని వెల్లడించారు. మృతుడు మధుమేహం, హైపో థైరాయిడ్, హైపర్ సెన్సిటివ్ వంటి లక్షణాలు కలిగి ఉన్నారని చెప్పారు. మృతుడికి గతంలో కరోనా రాలేదని తెలిపారు.