New Delhi, Jan 7: కరోనావైరస్ కేసులు దేశంలో ఒక్కసారిగా పెరిగాయి. ఈ రోజు ఏకంగా 90 వేలకు పైగా కేసులు (Covid-19 in India) నమోదయ్యాయి. ఇక కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ సూచనలన్నీ దేశంలో థర్డ్ వేవ్ (Corona Third Wave) ముంచుకొస్తున్నట్లుగా చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని ఇంతకుముందు ఉన్న 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది.
కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని (Quarantine Period) తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది.
ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. అలాగే స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్‌గానే వారిని పరిగణిస్తారు. 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉండాలి. హెచ్‌ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి.
జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. క్షేత్ర స్థాయిలో ఎఎన్‌ఎం, శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్‌తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.