
Beijing, JAN 22: కరోనా వైరస్‌కు (Coronavirus) పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు (Covid deaths) సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మొత్తం 13 వేల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన వారంలో 13 వేల మంది మరణించారని, వారిలో 681 మంది శ్వాసవ్యవస్థ వైఫల్యంవల్ల, 11,987 మంది కరోనాతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్‌లు సోకడంవల్ల ప్రాణాలు కోల్పోయారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. కానీ కేవలం కరోనా కారణంగా 13 వేల మంది మృతిచెందారని మాత్రం చెప్పలేదు.
అంతకుముందు వారం చేసిన ప్రకటనలో దేశంలో జీరో కొవిడ్ (Zero covid) ఆంక్షలు ఎత్తివేసింది మొదలు జనవరి 12 వరకు 60 వేల కరోనా మరణాలు సంభవించాయని సీడీసీ తెలిపింది. కానీ, చైనా అధికారిక లెక్కలు తప్పుల తడకలని కరోనా కేసులు, మరణాల లెక్కలుకట్టే ఓ స్వతంత్ర సంస్థ చెబుతోంది. గత డిసెంబర్లో జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఇప్పటివరకు చైనాలో దాదాపు 6 లక్షల కరోనా మరణాలు సంభవించాయని స్పష్టంచేస్తోంది.