COVID-19 Variant JN.1: కొనసాగుతున్న కరోనా కల్లోలం, దేశంలో కొత్తగా 529 కేసులు నమోదు, 109కి పెరిగిన జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి

COVID-19 . (Photo Credits: IANS)

New Delhi, Dec 27: భారత్‌లో కరోనా వైరస్‌ (Coronavirus) కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,093గా ఉంది.

ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,33,340కి ఎగబాకింది. ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి 4.4 కోట్ల మంది (4,44,72,756) కోలుకున్నారు.

దేశంలో 69కి పెరిగిన కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు, తాజాగా ముగ్గురు క‌రోనాతో మృతి, గోవాలో అత్యధికంగా 34 జేఎన్ 1 వేరియంట్ కేసులు

ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు దేశంలో కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) కేసులు కూడా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 40 జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో డిసెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కుఈ కొత్త వేరియంట్‌ కేసులు దేశవ్యాప్తంగా మొత్తం 109కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందులో అత్యధికంగా గుజరాత్‌లో 36 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4‌, తమిళనాడులో 4, తెలంగాణలో 2 జేఎన్‌.1 కేసులు బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.