Covid Updates: మళ్లీ కరోనా విశ్వరూపం..ఒక్కరోజే 197 మంది మృతి, తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కల్లోలం, దేశంలో తాజాగా 43,846 కొత్త కేసులు, తెలంగాణలో 394 కొత్త కోవిడ్ కేసులు నమోదు, ఏపీలో 380 మందికి కోవిడ్ పాజిటివ్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్తగా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.
New Delhi, Mar 21: దేశంలో గత 24 గంటల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్తగా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు. 3,09,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు (Covid Tests) నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,33,602 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముంబైలో కరోనా (Mumbai Coronavirus) కట్టడికి నూతన గైడ్‌లైన్స్ విడుదల చేసి, అమలు చేస్తున్నారు. తాజాగా కొన్ని దేశాల నుంచి ముంబై వచ్చే ప్రయాణికులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి చేశారు. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఆఫ్రికాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్, మరో 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. అయితే 65 ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, ఐదేళ్లకన్నా తక్కువ వయసున్న చిన్నారులకు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపునిచ్చారు. దీనికి సంబంధించి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
తాజాగా మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. కరోనా సోకిన విషయాన్ని ఆదిత్య థాకరే స్వయంగా వెల్లడించారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసినవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం తొలగిపోలేదని స్పష్టం చేశారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 3.03 లక్షలకు కరోనా కేసులు చేరగా కరోనా వైరస్ తో 1,669 మంది మరణాణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,804 యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి 64, మేడ్చల్‌లో 34 కరోనా కేసులు నమోదయ్యయి.
హైదరాబాదులోని పలు పాఠశాలలు, కాలేజీల్లో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా హయత్ నగర్ లోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం తర్వాత కరోనా వైరస్ ప్రబలుతుండడం అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా, 380 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 పాజిటివ్ కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 51, కృష్ణా జిల్లాలో 44, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా తూర్పు గోదావరి జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 6, కడప జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య మరింత అధికమైంది. చాన్నాళ్ల తర్వాత 2 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,93,366 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,094 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,189కి చేరింది.