Cyclone Biparjoy Update: ఇంకా ఆగని తుపాను విధ్వంసం, గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపుకు మళ్లిన బిపర్‌జాయ్‌, పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

Biparjoy

Jalore, June 16: గత పదిరోజులుగా ఉత్తరాది రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్‌జోయ్‌ తుపాను గుజరాత్‌లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది.

దీని ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బిపర్‌జాయ్‌ తుఫాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుఫానుగా ఇది నిలిచిపోతుందన్నారు.

భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బిపార్జోయ్ తుఫాను,70 కిమి వేగంతో తీవ్ర అల్పపీడనంగా మారనున్న సైక్లోన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

బిపార్జోయ్ తుఫాను తూర్పు-ఈశాన్య దిశగా కదిలి గుజరాత్‌లోని భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రం నాటికి, ఇది సౌరాష్ట్ర మరియు కచ్ మరియు పరిసర ప్రాంతాలలో 50-60kmph నుండి 70kmph వేగంతో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర, DG, IMD తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ANI Videos

బిపర్‌జోయ్‌ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. గుజరాత్‌ విధ్వంసం తర్వాత తుపాన్‌ రాజస్థాన్‌కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్‌ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్‌ రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది.

వీడియో ఇదిగో, బిపర్‌జోయ్‌ విధ్వంసం, కఛ్‌ జిల్లాలో నేలకొరిగిన మహావృక్షాలు, ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని తెలిపిన ఐఎండీ

బలమైన ఈదురుగాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇండ్లు కూలిపోతున్నాయి. సౌరాష్ట్ర, కచ్‌ తీరాలతోపాటు ద్వారకలోని గోమతి ఘాట్‌ (Gomti Ghat), దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. భీకర గాలులతో కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మోర్బీ జిల్లాలో (Morbi) భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండటంతోపాటు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు (Gusty Winds) వీస్తున్నాయి. దీంతో చెట్లు కూలిపోగా, 300 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో సుమారు 45 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయన్నారు. తుఫాను కారణంగా ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారని తెలిపారు.

తుఫాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. . 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు రోడ్లు,భవనాల శాఖకు చెందిన 115 బృంధాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 99 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది.

తుపాను నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది. తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపింది.

ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాలకు సైతం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అదే విధంగా బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుఫాను పీడిత ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని ఆసల్యంగా నడుపుతున్నట్లు పేర్కొంది.