Cyclone Dana Update: దానా తుపాన్ తీవ్రత తెలిపే వీడియోలు ఇవిగో, అల్లకల్లోలంగా సముద్రం, వణుకుతున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు
ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Puri, Oct 24: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana) వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ తీవ్ర తుఫాను ప్రస్తుతం ఒడిశా (Odisha)లోని పరాదీప్‌కు 260 కిలోమీటర్లు.. ధమ్రాకు 290 కి.మీ దూరంలో.. బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వణుకుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. ‘దానా’ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలను సైతం మూసివేశారు.
తెలుగు రాష్ట్రాలపై ఈ తుపాను ప్రభావం అంతగా ఉండకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Dana Cyclone Effect Videos
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానా తుపాను నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.
తీవ్ర తుఫాను నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఒడిశాలోని రెండు ప్రధాన ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple)తోపాటు.. కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని (Konark Temple) మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆలయాలతోపాటు పలు స్మారక చిహ్నాలు, మ్యూజియంలను సైతం మూసివేయనున్నారు.
ఒడిశాలోని గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియోంజర్, ధెంకనల్, జాజ్‌పూర్, అంగుల్, ఖోర్ధా, నయాగర్, కటక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐంఎడీ అంచనా వేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు.. ఆయా జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు.
ఇక దానా తుఫాను కారణంగా సౌత్ ఈస్టర్న్ పరిధిలో నడిచే దాదాపు 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కామాఖ్య – యశ్వంత్‌పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా – భువనేశ్వర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా – యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దయ్యాయి.