Cyclone Fengal Updates: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు!

నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

cyclone fengal updates, heavy rains for Andhra Pradesh and Telangana(ANI)

Hyd, Nov 30:  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తుపాను కారణంగా తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఇక ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తుపాను ప్రభావంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద ఆరో నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు పోర్టులకు 3వ నంబర్, విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

తెలంగాణలో ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.