Delhi: ఢిల్లీలో దారుణం, యువకుడి ఆత్మహత్యకు ప్రతీకారంగా యువతిపై సామూహిక అత్యాచారం, మొత్తం 762 పేజీలు ఛార్జీషీటు దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు, లిస్టులో 21 మంది పేర్లు
ఓ యువకుడి ఆత్మహత్యకు ప్రతీకారంగా ఓ యువతిని కిడ్నాప్ చేసి, కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి, ఆమె ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు.
New Delhi, April 26: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి ఆత్మహత్యకు ప్రతీకారంగా ఓ యువతిని కిడ్నాప్ చేసి, కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి, ఆమె ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఈ ఘటన ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో (Kasturba Nagar gang-rape case) ఈ ఏడాది జనవరి నెలలో చోటు చేసుకోగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేశారు.ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీటును పోలీసులు నిన్న కోర్టుకు సమర్పించారు. ఛార్జీషీటులో మొత్తం 21 మంది పేర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఛార్జీషీటు (Police files charge sheet) మొత్తం 762 పేజీలు ఉందన్నారు.
నిందితుల నుంచి యువతికి సంబంధించిన 26 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 12 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో 14 వీడియోలు నిందితుల మొబైల్స్ లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. బాధితురాలిని ప్రేమ పేరిట వేధింపులకు గురి చేశాడు. ప్రేమించాలని వెంట పడ్డాడు. కానీ అతని ప్రేమను ఆమె తిరస్కరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సదరు యువకుడు గతేడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు ఈ యువతే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను ఈ ఏడాది జనవరిలో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆమె జుట్టు కత్తిరించి, ముఖానికి బ్లాక్ కలర్ పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.