Mumbai, April 25: హనుమాన్ చాలీసా పఠనం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీ పఠనం చేస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం, హిందుత్వవాదుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది.తాజాగా.. హిందుత్వవాదులను, బీజేపీని ఇరుకునపెట్టడానికి శరద్ పవార్ (NCP Chief Sharad Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ ఓ ఎత్తుగడ వేసింది.
తాము ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా, నమాజ్ చదువుతామని, అందుకు తమకు అనుమతి కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఎన్సీపీ లేఖ రాసింది.ఎన్సీపీ నాయకురాలు ఫమీదా హసన్ ఖాన్ మాట్లాడుతూ.. ”ఢిల్లీలో లోకకల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు నమాజ్ చేస్తా. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, నమోకార్ మంత్ర చదువుతా. ఇందుకు నాకు అనుమతి కావాలి” అంటూ ఫమీదా హసన్ డిమాండ్ చేశారు.ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రయోజనం పొందితే… మేము కూడా ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా చదువుతామని, తమకూ అనుమతి కావాలని ఫమీదా హసన్ డిమాండ్ చేశారు.
ఇక మత ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల విషయమై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. సోమవారం మహా హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘లౌడ్‌స్పీకర్లపై దేశం మొత్తానికి వర్తించేలా ఒక చట్టం చేయాలని మేము విజ్ణప్తి చేస్తాన్నాం. ఇలాంటి చట్టం వస్తే మహారాష్ట్రలో తలెత్తిన ఇబ్బందులు దేశంలో ఎక్కడా తలెత్తకుండా చూడవచ్చు. ఈ విషయమై అవసరమైతే రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయించాం’’ అని అన్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన ఈ వివాదం కొద్ది రోజులుగా మహారాష్ట్రను కుదిపివేస్తోంది. మహారాష్ట్రలో మే 3 వరకు మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్ల నుంచి శబ్దం రాకుండా ఆపేయాలని, అలా జరగని పక్షంలో తర్వాత చేసేది చేస్తామని రాజ్ థాకరే ఇప్పటికే హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిత్య థాకరే మాట్లాడుతూ… లౌడ్ స్పీకర్ల విషయంలో కేంద్రాన్ని కలుస్తామని, ఓ బృందంగా వెళ్లి, కేంద్రంతో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. అసలు దేశ వ్యాప్తంగా కేంద్రం లౌడ్ స్పీకర్ల విషయంలో ఓ నిర్ణయాన్ని తీసుకుంటే, రాష్ట్రాలకు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వాటికి భంగం వాటిల్లితే పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటే… తమకు ఈ తలనొప్పులు ఉండేవే కావన్నారు. అతి త్వరలోనే తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కలుస్తామని దిలీప్ వాల్సే ప్రకటించారు.