Delhi Rains: భారీ వర్షం, ఈదురుగాలులతో ఢిల్లీ అతలాకుతలం, పలు విమానాల రాకపోకలపై ప్రభావం, ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక
సోమవారం వేకువ ఝామున మొదలైన వరణుడి ప్రతాపం.. నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం (Delhi Rains) కురుస్తున్నది.
New Delhi, May 23: దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం వేకువ ఝామున మొదలైన వరణుడి ప్రతాపం.. నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం (Delhi Rains) కురుస్తున్నది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి చాలాచోట్ల. దీంతో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. దీంతో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. గంటలకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణంలో ప్రతికూల ప్రభావంతో.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. ప్రయాణికులు.. ముందుగానే స్టేటస్‌ను పరిశీలించుకుని ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోవాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. వానతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని జెట్‌ఎయిర్‌వేస్ వెల్లడించింది.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో రాబోయే గంటల్లో ఉరుములు మెరుపులతో(Heavy Rainfall, Thunderstorm) కూడిన జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా చోట్ల ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో పాత భవనాలపై పిడుగుల ప్రభావం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణం చల్లబడటం ఊరట ఇచ్చినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నష్టంపైనా అధికారులు అంచనాకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని లోని డెహట్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, బహదూర్‌గఢ్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్‌రౌలా, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా గురుగ్రామ్ ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. మరో రెండు గంటలపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వెల్లడించింది.