Delhi School Holidays Update: ఢిల్లీలో అన్ని స్కూళ్లకు నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ వరకూ శీతాకాల సెలవులు, కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు

ఢిల్లీ చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఢిల్లీని కలుసితం చేస్తున్నాయి.

Delhi Air Pollution (Photo Credit: ANI)

New Delhi, Nov 8: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుని విలవిలలాడుతోంది. ఢిల్లీ చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఢిల్లీని కలుసితం చేస్తున్నాయి. దేశ రాజధానిలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.

ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ వరకూ అన్ని పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యశాఖ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఢిల్లీలో పాఠశాలలకు శీతాకాల సెలవులు జనవరిలో ఇస్తుంటారు. అయితే, ఈ సారి తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ముందుగానే ప్రకటించారు.కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్‌, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వానస్థాయికి చేరుకుంటుందని అంచనా.\

వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీవాసులు.. వాయు కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్‌ లకు కూడా దారి తీసే ప్రమాదం.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల హెచ్చరిక

బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరై .. స్కూళ్ల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

10, 12వ తరగతులకు మినహా మిగతా అక్కడి తరగతుల విద్యార్థులు ఈ శుక్రవారం(నవంబర్‌ 10) తేదీ వరకు స్కూళ్లకు హాజరు కానక్కర్లేదని(ఫిజికల్‌ క్లాస్‌లకు మాత్రమే) ఆదేశించింది. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతుండడంతో తాజాగా సెలవుల్ని పొడిగించింది.

దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్‌లో తొలిసారి తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశించాయి. వచ్చే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘తీవ్రమైన’ విభాగంలో నమోదు కావడం గమనార్హం.మంగళవారం సాయంత్రం 4 గంటలకు 395 ఉన్న AQI.. బుధవారం ఉదయానికి 421కి చేరింది. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా 409 వద్ద వాయు నాణ్యత సూచీ నమోదు అయ్యింది.

పంజాబీ బాగ్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 460కి చేరింది. ఆనంద్‌ విహార్‌లో 452, ఆర్‌కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (CPCB) పేర్కొంది. ఢిల్లీ అంతటా గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతోందని పేర్కొంది. నవంబర్‌ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.



సంబంధిత వార్తలు