Newdelhi, Nov 6: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో (Air Pollution) విలవిల్లాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) పరిమితి కంటే ఇక్కడ వందరెట్లు అధిక కాలుష్యం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో బడులకు ఈ నెల 10 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో పలువురు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాయు కాలుష్యం హానికరమైనదని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు.
Can Air Pollution Cause Cancer? What AIIMS Doctor Says https://t.co/EOE2G6Skhf pic.twitter.com/8ypgI9rAwa
— NDTV (@ndtv) November 6, 2023
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్..
వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని అన్నారు. వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.