Chandigarh, NOV 05: హర్యానాలోని ఓ ప్రధానోపాధ్యాయుడు (Principal) దారుణానికి ఒడిగట్టాడు. జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది బాలికలపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డాడు. అతడి ఆగడాలు తాళలేక బాలికలు.. చివరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం(PMO), జాతీయ మహిళా కమిషన్‌లకూ లేఖలు రాసినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. అతడిపై కేసు నమోదు చేశారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందంతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫిర్యాదులను బట్టి చూస్తే దాదాపు 50 మందికిపైగా అమ్మాయిలపై ప్రిన్సిపల్ లైంగిక వైధింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు (Schoolgirls) పాల్పడుతున్నాడంటూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినులు హరియాణా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇలా 60 ఫిర్యాదులు వచ్చినట్లు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియా పేర్కొన్నారు. ఇందులో 50 మంది అమ్మాయిలు నిందితుడి చేతిలో లైంగిక వేధింపులకు గురికాగా.. మరో 10 మంది అతడి చేష్టల గురించి తెలిసినవారేనని అన్నారు.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఫిర్యాదు చేసినవాళ్లంతా మైనర్ అమ్మాయిలేనని.. ఆఫీస్‌కు పిలిచి వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియా వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ మహిళా కమిషన్‌లకు లేఖ రాసినట్లు సమాచారం.