Disha Case Encounter: దిశ కేసులో నిందితుల మృతదేహాలు దిల్లీకి తరలింపు? మరికొంతకాలం భద్రపరచాలంటూ తాజాగా ఆదేశాలు, ఎయిమ్స్‌లో భద్రపరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు. ఈ మేరకు అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.....
Hyderabad, December 17: దిశ హత్యాచారం కేసు (Disha Rape-Murder Case) లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఎన్‌కౌంటర్ (encounter)లో హతమయిన నలుగురు నిందితుల (Accused Four) మృతదేహాలపై ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న వారి మృతదేహాలను దిల్లీలోని ఎయిమ్స్ (All India Institute of Medical Sciences, New Delhi)కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.
నిజానికి ఆ నలుగురి మృతదేహాలను వారు ఎన్‌కౌంటర్ అయిన డిసెంబర్ 06వ తేదీ రాత్రే ఖననం చేయాలని పోలీసులు భావించినప్పటికీ కోర్టు ఆదేశాల వల్ల అది సాధ్యపడలేదు. వారి మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. అయితే డిసెంబర్ 13 వరకు వారి మృతదేహాలను భద్రపరచాలంటూ హైకోర్ట్ మరోసారి ఆదేశాలివ్వడంతో మృతదేహాలను గాంధీ మార్చురీకి బదిలీ చేసి అక్కడ భద్రపరుస్తున్నారు.
ఇంతలో ఈ కేసులో సుప్రీంకోర్ట్ జోక్యం చేసుకోవడంతో, సుప్రీం ఆదేశాల మేరకు మిగతా దర్యాప్తు సంస్థల విచారణ ఆగిపోయింది. ఈనేపథ్యంలో మృతదేహాల పట్ల ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ మృతదేహాలపై పెట్టిన గడువు ముగిసిందని హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చినపుడు, ప్రస్తుతం కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉందని సుప్రీం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు వాటిని అలాగే భద్రపరచాలంటూ కోర్ట్ సూచించింది.
అప్పట్నించి గాంధీ ఆసుపత్రిలోనే భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బుల్లెట్ గాయాలు ఉండటం చేత మృతదేహాలను భద్రపరచటంలో సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరికొంత కాలం ఆ నలుగురి మృతదేహాలను భద్రపరచాలంటూ ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది. అయితే గాంధీ అసుపత్రి వర్గాలు ఈ విషయంలో తామేమి చేయలేమంటున్నారు. ఇప్పటికే మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వచ్చాయని, ఇక వాటిని భద్రపరచటం ఇక్కడ సాధ్యం కాదని తేల్చిచెప్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోతే వాటిని రీపోస్ట్ మార్టం చేయడానికి కూడా అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ నలుగురి మృతదేహాలను గాంధీ అసుపత్రి వర్గాల సూచన మేరకు దిల్లీలోని ఎయిమ్స్ కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. ఎయిమ్స్ లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు. ఈ మేరకు అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.