Telangana Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్ట్, 6 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం, నిందితులపై సానుభూతి అవసరం లేదని వ్యాఖ్య
Supreme Court of India | Photo-IANS)

New Delhi, December 12: దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ (Disha Case Encounter) పై సుప్రీంకోర్టు (Supreme Court)లో వాదనలు ముగిశాయి.  ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమీషన్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్ట్ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ కమీషన్‌కు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.ఎస్.సర్పూర్కర్ నేతృత్వం వహించనున్నారు. రిటైర్డ్ బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రేఖా బల్డోటా, మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ ఈ కమిషన్‌లోని ఇతర సభ్యులుగా సుప్రీం నియమించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపి 6 నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా  ఆత్మ రక్షణ కోసమే పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని, ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక విచారణ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) వాదనలు వినిపించారు. అయితే అది ఆత్మరక్షణ కోసం కాదని, కావాలని చేసిన బూటకపు ఎన్‌కౌంటర్ అని జీఎస్ మణి (GS Mani) వాదనలు వినిపించారు. దీంతో మీరేందుకు పిటిషన్ వేశారని చీఫ్ జస్టిస్ బోబ్డే (CJI SA Bobde) పిటిషనర్‌ను ప్రశ్నించారు. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిందితుల కుటుంబాలకు నష్ట పరిహారంపై ప్రస్తావించిన పిటిషనర్‌ను సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఆ నిందితుల పట్ల సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని, వారు చేసిన దారుణాన్ని చూస్తూ ఎవరూ ఊరుకోరని తెలిపింది.   దిశను కాల్చిన చోటే కాల్చివేత, దిశ హత్యాచారం కేసులో తీర్పు చెప్పిన పోలీస్ తూటా

ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఎన్‌కౌంటర్ జరిగిన తీరును వివరించారు. సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పోలీసులపైకి కర్రలు, రాళ్లతో దాడి చేశారని, పోలీసుల పిస్తోళ్లను లాక్కొని ఫైరింగ్ చేశారని అయితే అవి మిస్ ఫైర్ అయ్యాయని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. ఈ కేసులో సుప్రీం నిబంధనలను ఉల్లంఘించలేదని, ఇప్పటికే ప్రత్యేక బృందంతో ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఇటు NHRC కూడా సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుందని ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జీలతో మరో విచారణ ఎందుకు అని రోహత్గి అభిప్రాయపడ్డారు.

ఇందుకు స్పందించిన ధర్మాసనం, పోలీసుల ఎన్‌కౌంటర్‌ను తాము ఇప్పుడే తప్పుబట్టడం లేదని, కానీ నిజానిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని సీజేఐ బోబ్డే పేర్కొన్నారు.  దర్యాప్తుకు సంబంధించిన ప్రతీ ఆధారం మీడియాకు ఎలా లభిస్తుందని సీజేఐ ప్రశ్నించారు.  కాబట్టి ఈ కేసుపై నిశ్పక్షపాతమైన దర్యాప్తు (Impartial Inquiry) చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.

ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఇక ఈ కేసు విషయంలో తాము తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు ఏ ఇతర కోర్టులు, సంఘాలు విచారణ జరపొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై  ఇప్పటివరకూ  దర్యాప్తులన్నింటిపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. అలాగే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి  మీడియా, సోషల్ మీడియాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.