ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను రెండు రోజులపాటు విశ్లేషించిన అనంతరం, కొన్ని సవరణలతో ప్రతిపాదనలను చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు మొత్తం 29 జిల్లాలు రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం ప్రకారం మార్కాపురం, మదనపల్లె, పోలవరం కొత్త జిల్లాలుగా రూపుదిద్దుకోనున్నాయి. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ప్రకటించారు. కొత్త జిల్లాలు రావడం వల్ల ప్రభుత్వ సేవలు గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా మారడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు రెవెన్యూ పరిపాలనలోనూ కీలక మార్పులు చేశారు. రాష్ట్రంలో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
నక్కపల్లి – అనకాపల్లి జిల్లా
అద్దంకి – ప్రకాశం జిల్లా
పీలేరు – మదనపల్లె జిల్లా
బనగానపల్లె – నంద్యాల జిల్లా
మడకశిర – సత్యసాయి జిల్లా
ఇంకా, కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి, పెద్దహరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజల అభ్యర్థనలు, స్థల ఆధారిత పరిపాలనా అవసరాలు, సేవల విస్తరణ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారుల నియామకాలు కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.