Domestic Flights Suspended: కరోనావైరస్ ఎఫెక్ట్, మార్చి 24 అర్ధరాత్రి నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పౌర విమానయాన శాఖ

రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య తగ్గితేనే ఆంక్షలు సడిలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అందుకు ప్రజల సహకారం అవసరం అవుతుంది......

maged used for representational purpose only | (Photo Credits: GoAir

New Delhi, March 23:  కరోనావైరస్ వ్యాప్తి (COVD 19 Outbreak) నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 అర్ధరాత్రి తర్వాత అని డొమెస్టిక్ విమాన సర్వీసులను (Domestic Flights) రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. దేశీయ విమానాలు 50 శాతం నడుస్తుండగా,  తాజాగా పూర్తి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మంగళవారం అర్ధరాత్రి 11:59 వరకు దేశీయ విమానాలన్నీ గమ్యస్థానాలకు చేరుకోవాలి అని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ నిషేధం ఎప్పటివరకు అనేది వెల్లడించలేదు. వీటికి కూడా కనీసం మార్చ్ 31 వరకు నిలిపివేత అమలులో ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు సరుకును ఆఫ్‌లోడ్ చేసే కార్గో విమానాలకు మినహాయింపు ఇస్తామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఈ నెల 31 వరకు అన్ని  రైళ్లు బంద్

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్యాసెంజర్ రైళ్లను మరియు సబర్బన్ సేవలను మార్చి 31 నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. క్యాన్సల్ అయిన టికెట్లకు పూర్తి రీఫండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. గూడ్స్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. దేశంలో చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ప్రజారవాణా వ్యవస్థను మాసాంతం వరకు నిలిపివేశాయి. అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసుకున్నాయి. కేవలం అత్యవసర సేవల గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నాయి.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాల సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా 415 కేసులు నమోదయ్యాయి, మరణాల సంఖ్య 8కి చేరుకుంది.

అయితే దేశవ్యాప్తంగా ప్రతి దానికి మార్చ్ 31 గడువుగా పెట్టుకుంటున్నప్పటికీ, అది కరోనావైరస్ తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య తగ్గితేనే ఆంక్షలు సడిలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అందుకు ప్రజల సహకారం అవసరం అవుతుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమై వ్యాప్తిని కట్టడి చేయగలిగినపుడే ఆంక్షలు సడలించటానికి వీలు కలుగుతుంది.