Sand Mining Case: ఎన్నికల వేళ పంజాబ్‌లో ఈడీ దూకుడు, అక్రమ మైనింగ్ వ్యవవహారంలో సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్, ఎన్ని కుట్రలకు పాల్పడినా పంజాబ్‌లో బీజేపీ గెలవడం అసాధ్యమని తెలిపిన సీఎం చన్నీ

పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Punjab Chief Minister Charanjit Singh Channi and his nephew Bhupinder Singh Honey(photo-ANI)

New Delhi, February 4: ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ( Punjab CM Charanjit Singh ) కుటుంబ సభ్యులపై ఈడీ అధికారులు దాడి చేశారు. చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ నివాసం, కార్యాలయాలపై దాడి చేసిన ఈడీ అధికారులు నిన్న అర్ధరాత్రి ఆయనను (ED Arrests Punjab CM Charanjit Singh Channi's Nephew ) అరెస్ట్ చేశారు.

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో (Sand Mining Case) మనీ లాండరింగ్‌ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది. ఎనిమిది గంటలపాటు విచారించిన తర్వాత గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత మొహాలీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.2018 నాటి ఇసుక అక్రమ మైనింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. జనవరి 19న నిర్వహించిన దాడుల్లో రూ. 10 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు భూపీందర్ కు చెందిన స్థలాల్లో రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలను ప్రారంభించినట్టు ఈడీ తెలిపింది. ఈ ముగ్గురు ప్రొవైడర్స్‌ ఓవర్సీస్‌ సర్వీసెసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ఈడీ గుర్తించింది. దీంతో వారిపై అక్రమ మైనింగ్‌ వ్యవహరంలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

మరోవైపు తన మేనల్లుడిని ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం చన్నీ మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని విమర్శించారు. బీజేపీ కుట్రలకు తాము భయపడమని చెప్పారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా పంజాబ్ లో గెలవడం అసాధ్యమని అన్నారు.