Sidhi Road Accident: అమిత్ షా సభకు వెళ్లి వస్తూ 12 మంది మృతి, మధ్యప్రదేశ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన శివరాజ్ సింగ్ చౌహాన్
వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Rewa, FEB 25: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో (Madhya Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని రేవా (Rewa), సిద్ధి ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదం సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
సాత్నాలో షబ్రీ జయంతి సందర్భంగా, షెడ్యూల్డ్ తెగల కోల్ మహాకుంభ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలు సాయంత్రం 5గంటలకు సిద్ధికి బస్సుల ద్వారా బయలుదేరారు. మొహానియా వద్ద టీ, స్నాక్స్ కోసం బస్సులను రోడ్డుపక్కన నిలిపి ఉంచారు. బస్సులోనివారికి అల్పాహారం అందిస్తున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు బస్సులను (Sidhi Road Accident) ఢీకొట్టింది. దీంతో ముందున్న బస్సు పక్కనేఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సులోనివారు బస్సు కింద పడటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉంది. ఈ ప్రమాదం రాత్రి 9గంటల సమయంలో జరిగింది.
ప్రమాద సమయంలోనే ఎనిమిది మంది మరణించగా, రేవా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరో నలుగురు మరణించారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. మరో 39 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం శివరాజ్ చౌహాన్ రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు.