Farm Bills Protest: రైతు ఘోష..ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన రైతులు, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్షకుల నిరసనతో భగ్గుమన్న దేశ రాజధాని
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు (Farm Bills Protest) భగ్గుమంటున్నాయి. పంజాబ్, హర్యానాతో పాటు రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నిరసనల సెగలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు.
New Delhi, Sep 28: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు (Farm Bills Protest) భగ్గుమంటున్నాయి. పంజాబ్, హర్యానాతో పాటు రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నిరసనల సెగలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా ఏకమై నినాదాలు చేశారు. ఇండియా గేట్ వద్ద వ్యవసాయ బిల్లును నిరశిస్తూ ట్రాక్టర్‌ను దగ్ధం (Tractor Set On Fire At India Gate) చేశారు. ప్రధాని మోదీ (PM Narendra Modi) దిష్టి బొమ్మను సైతం అందులో తగలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం 7.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, కాలిపోయిన వాహనాన్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
సుమారు 15 నుంచి 20 మంది వ్యక్తులు సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో గుమిగూడి ట్రాక్టర్‌కు నిప్పు పెట్టినట్టు న్యూఢిల్లీ డీసీపీ తెలిపారు. మంటలను ఆర్పి, ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగించామని చెప్పారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని గుర్తిస్తున్నామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నిరసనకారులు కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేసినట్టు వారు చెప్పారు.
Here's Fire Video
రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా గత వారం రోజులుగా పంజాబ్, హర్యానా వ్యాప్తంగా రైతులు నిరసన గళాలు వినిపిస్తున్నారు. బైఠాయింపు ప్రదర్శనలు జరుపుతున్నారు. గత శుక్రవారం దేశవ్యాప్త బంద్‌లో కూడా రైతులు, రైతు సంస్థలు, విపక్ష నేతలు పాల్గొన్నారు. మూడు రోజుల 'రైల్ రోకో' నిరసనల్లో భాగంగా అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్ దిగ్బంధాన్ని రైతులు కొనసాగిస్తున్నారు.
నార్తరన్ రైల్వే 3 రైళ్లను రద్దు చేయడంతో పాట, 20 ప్రత్యేక రైళ్ల రూట్లలో మార్పు చేసింది. పొరుగున ఉన్న హర్యానాలో రైతులు కర్నల్-మీరట్, రోహ్‌టక్-ఝజ్జర్, ఢిల్లీ-హిసార్ తదితర రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. బిల్లులపై బీజేపీ చర్యను నిరసిస్తూ, ఆ పార్టీతో 25 ఏళ్లుగా సాగిస్తున్న స్నేహానికి అకాలీలు గుడ్‌బై చెప్పి ఎన్డీయే నుంచి తప్పుకొన్నారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ వైదొలిగారు.
ఇదిలా ఉంటే నేడు పంజాబ్ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి. ఆయన జయంతి రోజున రైతులు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని రైతు సంఘాలు చెబుతున్నాయి. పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్‌సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా..వ్యవసాయ బిల్లులు మాత్రం చట్టరూపం దాల్చాయి. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు.
విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం, బిల్లు ముసాయిదా ప్రతులను చించేసిన విపక్ష ఎంపీలు
ఈ బిల్లులను నిరసిస్తూ దేశంలోని రైతులంతా ఏకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది. రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది. వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్‌డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆదివారం లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఇక వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా సోమవారంనాడు ఆయన బైఠాయింపు నిరసనకు దిగుతున్నామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్ వద్ద ఆయన ఈ నిరసన చేపట్టనున్నారు.దీంతో పాటు అక్టోబర్ 1న త్రీ తఖ్త్ నుంచి మొహాలి వరకు 'కిసాన్ మార్చ్'కి కెప్టెన్ అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు.
కాగా గత శుక్రవారం 31 రైతులు సంస్థలు పంజాబ్ బంద్‌లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమంబెంగాల్‌లోనూ నిరసనలు జరిగాయి. హర్యానాలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహా పలు సంస్థలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)