One Nation, One FAStag: మనుషులకు ఆధార్ కార్డ్ లాగా, వాహనాలకు ఫాస్టాగ్స్, రహదారులపై నడిచే అన్ని వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి, ఫాస్టాగ్స్ ఎలా పొందాలి? రీఛార్జ్ వివరాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి
వన్-టైమ్ ట్యాగ్ డిపాజిట్ కింద కార్లు, జీపులు మరియు వ్యాన్ల కోసం రూ. 200 మరియు బస్సులు, ట్రక్కులు, ట్రాక్టలు లాంటి భారీ వాహనాలకు రూ.500 వసూలు చేయడం జరుగుతుంది....
New Delhi, October 15: దేశంలోని జాతీయ రహదారులపై నడిచే వాహనాలకు డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్స్ (FAStag) తప్పనిసరి అని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు. ఢిల్లీలో ఒకే దేశం, ఒకేట్యాగ్ (One nation - one Tag) కార్యక్రమాన్ని ప్రారంభించిన గడ్కరీ, భారతదేశంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆలోచనలను అమలు చేయటానికి తాము కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫాస్టాగ్స్ ద్వారా వాహనదారులు టోల్ ప్లాజా వద్ద జరిపే నగదు చెల్లింపుల్లో ఇకపై ఎలాంటి గందరగోళం చోటుచేసుకోదని గడ్కరీ వివరించారు. వాహనాలకు ఫాస్టాగ్స్, ఆధార్ కార్డ్ లా పనిచేస్తాయన్నారు. ( భారీ జరిమానాలు, టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది నితిన్ గడ్కరే!)
ప్రస్తుతం టోల్ ప్లాజాలలో ఒక లేన్ లో మాత్రమే ఫాస్టాగ్‌ను అనుమతిస్తున్నారు. ఇకపై ఇది రివర్స్ కాబోతుంది, ఒక లేన్ లో మాత్రమే నగదు రూపంలో టోల్ ఛార్జ్ స్వీకరించడం జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులకు అనుసంధానించిన అన్ని టోల్ ప్లాజాలలోని ప్రతి లేన్ అనుమతిస్తాయి. ఇప్పటికే దేశంలోని సగానికి పైగా టోల్ ప్లాజాల్లో ఈ ప్రక్రియ పూర్తైంది. డిసెంబర్ 1 నాటికి అన్ని టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులను అంగీకరించే సాంకేతిక పరిజ్ఞానంతో మార్చబడతాయి. ఇందుకోసం ప్రతి వాహనదారుడు తమ వాహనానికి RFID (Radio Frequency Identification) చిప్స్ ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యలతో కూడిన RFID ట్యాగ్‌లు ఇవ్వబడతాయి. ఈ RFID కార్డులను ఆన్ లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
అసలు FAStag అంటే ఏమిటి?
ఫాస్టాగ్ అనేది రీఛార్జ్ చేసుకోగల 'ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్డ్'. ఇది వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌కు అతుకించి ఉంచబడుతుంది.
టోల్ ప్లాజా వద్ద ఉన్న సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాహనదారుడి ఖాతా నుండి టోల్ కు సరిపడే చెల్లింపును తీసివేస్తుంది. 25 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే టోల్ ప్లాజాలోని రీడర్ వాహనం లోని కార్డును గుర్తిస్తుంది.
దీని ద్వారా టోల్ చెల్లింపు సులభతరం అవుతుంది, ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు, చిల్లర కోసం వెతకే బాధ తప్పుతుంది.
ప్రస్తుతం ఏడు బ్యాంకులు ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పేటిఎమ్ మరియు ఈక్విటాస్ ఫైనాన్స్ బ్యాంక్ లు ఫాస్ట్ ట్యాగ్ తో అనుసంధానించబడి ఉన్నాయి.
My FASTag app ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ కార్డులను కేవలం టోల్ చెల్లింపులకే కాకుండా గుర్తింపు పొందిన బంకుల్లో ఇంధనం కొనుగోలు చేసుకోవడానికి మరియు పార్కింగ్ ఫీజ్ చెల్లించడానికి కూడా ఉపయోగించవచ్చు.
FAStag ఎలా పొందవచ్చు?
ఫాస్టాగ్ ఖాతా క్రియేట్ చేయటానికి వాహనం యొక్క RCతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు మరియు వాహనదారుడి ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం అవుతుంది.
అన్ని టోల్ ప్లాజాల వద్ద మరియు కొన్ని బ్యాంకులు, అలాగే 'అమెజాన్ ఇండియా' లో కూడా ఫాస్టాగ్స్ అందుబాటులో ఉన్నాయి. వన్-టైమ్ ట్యాగ్ డిపాజిట్ కింద కార్లు, జీపులు మరియు వ్యాన్ల కోసం రూ. 200 మరియు బస్సులు, ట్రక్కులు, ట్రాక్టలు లాంటి భారీ వాహనాలకు రూ.500 వసూలు చేయడం జరుగుతుంది.