New Delhi, September 11: నూతన మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధించడం, విధించకపోవడం పట్ల రాష్ట్రాలే సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు సవరించుకునే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. అంతకు ముందు ట్రాఫిక్ జరిమానాల పట్ల కఠినంగా వ్యవహరించిన నితిన్ గడ్కరీ గుజరాత్ రాష్ట్రంలోని బీజీపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తోసిపుచ్చి భారీ జరిమానాలను తగ్గిస్తూ సవరణలు చేసిన ఒక్కరోజు లోనే నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 (The new Motor Vehicles Amendment Act) పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. బీజేపి పాలన లేని కొన్ని రాష్ట్రాలు ఈ నూతన చట్టం అమలును నిద్వంద్వంగా తిరస్కరించాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడుతూ ఈకాలంలో ప్రజలు ఎక్కువగా ఓలా, ఉబెర్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. అందువల్లే ఆటోమొబైల్ రంగం (Auto Sector) క్షీణించింది. కార్లు, బైక్ లు మొదలగుఅమ్మకాలు తగిపోయాయి అని వ్యాఖ్యానించింది. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 అమలు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నందు వల్లే విధిలేక, ఆ జరిమానాలు కట్టే స్తోమత లేక ప్రజలు ఓలా మరియు ఉబెర్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారని నెటిజన్స్ సెటైర్లు వేశారు. (నూతన మోటార్ వాహనాల చట్టాన్ని ఇంకా అమలు చేయని రాష్ట్రాలు ఇవే)
దీనిపై కూడా నితిన్ గడ్కరీ స్పందించారు. నిర్మలా సీతారామన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వాహనాల అమ్మకాలు తగ్గిపోవటానికి ఎలక్ట్రానిక్ రిక్షాలు మార్కెట్లో ప్రవేశించటం, వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ పెరగటం లాంటి కారణాలతో పాటు ఇది కూడా ఒక కారణం అని ఆయన అంగీకరించారు.
BS6 ప్రమాణాలతో కూడిన హోండా ఆక్టివా 125 ద్విచక్ర వాహనాలను నితిన్ గడ్కరీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ చలాన్లు, ఆటోమొబైల్ అమ్మకాలు మొదలగు అంశాలపై వివరణ ఇచ్చుకున్నారు. వాహానాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 10 శాతానికి తగ్గించమని ఆటోమొబైల్ రంగం వారు చేస్తున్న విజ్ఞప్తిని ఆర్థిక శాఖకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దానిపై తుది నిర్ణయం ఆర్థిక శాఖ వారే తీసుకోవాల్సి ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.