New Delhi, September 11: గత టర్మ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న అతిభయంకర 'నోట్ల రద్దు' నిర్ణయం సామాన్య ప్రజలను అనేక కష్టాలకు గురిచేసింది. అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఒక ప్రయత్నమైతే చేసిందని భావించి ప్రజలు ఈసారి కూడా తిరిగి ఎన్డీయేకే అధికారాన్ని కట్టబెట్టారు. అంతవరకూ బాగానే ఉంది.
కానీ, మరోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం నూతన మోటార్ వాహన సవరణ చట్టాన్ని (The new Motor Vehicles (Amendment) Act) ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ప్రజలెవ్వరూ హర్షించడం లేదు.
నూతన ట్రాఫిక్ సవరణ చట్టంలో భాగంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపేవారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిపై కనీస జరిమానాను రూ .500 నుండి 5,000 రూపాయలకు పెంచారు. పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని, ఇన్సూరెన్స్ లేదని, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఇలా అన్ని కలిపి వడ్డించే చలాన్లు ఒక్కో వాహనదారుడిపై రూ. 15 వేల నుంచి రూ. 60 వేల వరకు వెళ్తున్నాయి. చాలా మంది ఆ జరిమానాలకు భయపడి వాహనం బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరై వాహనాలు తీసి జరిమానాల భారిన పడినవారు తీవ్ర ఆగ్రహావేశాలతో తమ వాహనాలను తగలబెట్టడం, లేదా ధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి.
ఈ కొత్త చట్టానికి ఆద్యుడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari). టోల్ ప్లాజా వసూళ్లను కూడా ప్రవేశపెట్టింది ఈయనే. గడ్కరీ మాత్రం తాను ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టాన్ని సమర్థించుకుంటున్నారు. ప్రజలకు భయం ఉంటేనే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయనేది ఆయన వాదన. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తేల్చిచెపుతున్నారు.
కాగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సరైనదే కానీ ఇంతలా జరిమానాలు విధిస్తే ఆ భారాన్ని సామాన్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వారి సంపాదన కంటే ఎక్కువగా జరిమానాలు చెల్లించడాన్ని సామాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ట్రాఫిక్ నిబంధనలు జరగటం సహజమే. అందుకు తగిన రోడ్లు, సరైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా మరో రకంగా శిక్షలు ఉండాలనేది పలువురు రాజకీయ, ప్రజా సంఘాల అభిప్రాయం.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే ఈ నూతన వాహన చట్టం అమలులో లేదు. గుజరాత్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇంతకాలం నూతన వాహన సవరణ చట్టం అమలును నిలుపుదల చేశారు. తాజాగా అక్కడ కూడా అమలు చేసినప్పటికీ ప్రజలపై భారం పడకుండా జరిమానాలలో 90% వరకు రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనగా, నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా రూ. 1000 ఉండగా దానిని రూ. 100కు తగ్గించారు. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే విధించే జరిమానా రూ. 500కు తగ్గించారు. ఇలా ప్రతి జరిమానాలలో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నూతన వాహన సవరణ చట్టం ఇంకా అమలు చేయని రాష్ట్రాల జాబితా.
తెలంగాణ- మోటారు వాహనాల (సవరణ) చట్టంలోని నిబంధనలను పరిశీలించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కొత్త చట్టాన్ని అధ్యయనం చేసిన తర్వాత కమిటీ తన సూచనను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దాని ప్రకారమే ఎలా ముందుకు వెళ్లాలనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అప్పటి వరకు, రాష్ట్రంలో కొత్త జరిమానాలు అమలు చేయబడవు.
ఒడిశా- కొత్త మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను 3 నెలల పాటు అమలు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్రాఫిక్ పోలీసు శాఖను ఆదేశించారు. ఈ చట్టాన్ని సవరించాలని, జరిమానాలు తగ్గించాలని ఆయన మోదీ ప్రభుత్వాన్ని కోరనున్నారు.
పశ్చిమ బెంగాల్- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ జరిమానాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేవని, కావున తమ రాష్ట్రంలో ఈ కొత్త జరిమానాలను అమలు పరచడం లేదని మమతా బెనర్జీ ప్రభుత్వం మొహమాటం లేకుండా స్పష్టం చేసింది.
మధ్య ప్రదేశ్- కమల్ నాథ్ ప్రభుత్వం నూతన నిబంధనల అధ్యయనం కోసం ఒక కమిటీ వేసింది. నూతన జరిమానాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
ఛత్తీస్ ఘర్- ఛత్తీస్‌ఘర్ లో మోటారు వాహనాల (సవరణ) చట్టం ఇంకా అమలు కాలేదు. "ఇలాంటి భారీ జరిమానాలు ఉండకూడదు. ఈ నూతన చట్టాన్ని మా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏవైనా సవరణలు చేయగలదా? అనే అంశాలనూ పరిశీలిస్తున్నాం, దాని తర్వాతనే ముందుకెళ్తాం". అని ఛత్తీస్ ఘర్ హోం మినిస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పంజాబ్ - ట్రాఫిక్ నిబంధనలు ఎవ్వరూ ఉల్లంఘించ కూడదు, అదే సమయంలో భారీ జరిమానాలతో ప్రజలపై భారం మోపకూడదు. ప్రస్తుతానికైతే తమ రాష్ట్రంలో నూతన మోటారు వాహనాల (సవరణ) చట్టం అమలు చేయడం లేదని పంజాబ్ రాష్ట్ర రవాణా శాఖ రవాణా మంత్రి రజియా సుల్తానా తెలియజేశారు.
రాజస్థాన్ - మోటారు వాహనాల (సవరణ) చట్టం అనేది ఒక తొందరపాటు నిర్ణయం అని రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. జరిమానాలు ప్రజలు చెల్లించగలిగేలా ఉండాలి, ఈ చట్టం అమలు చేయాలా వద్దా? అనేది పరిశీలిస్తున్నాం అని రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి కొత్త చట్టం రాష్ట్రంలో అమలు కాలేదు.
పుదుచ్చేరి: మోటారు వాహనాల (సవరణ) చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ముఖ్యమంత్రి వి.నారాయణసామి తెలియజేశారు.
ఢిల్లీ- కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మోటారు వాహనాల (సవరణ) చట్టం ప్రకారం జరిమానాలను అమలు చేసింది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు పరచకపోవడంతో, దీని అమలుపై పున: పరిశీలిస్తుంది.