Holi Tragedy in Madhya Pradesh:హోలీ వేళ ఉజ్జయిని ఆలయంలో అగ్ని ప్రమాదం, హారతి ఇస్తుండగా చెలరేగిన మంటలు, పూజారి సహా 13 మందికి గాయాలు
బహుశా గులాల్‌లో రసాయనాలు ఉండటం వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. వెంటనే అక్కడున్న కొందరు భక్తులు ఈ సమాచారాన్ని ఫోనులో అగ్నిమాపక అధికారులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Bhopal, March 25: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల ప్రముఖ మహాకాళేశ్వరుని గర్భగుడిలో సోమవారం ఉదయం భస్మ హారతి సందర్భంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి కాలిన గాయాలయ్యాయి. హారతి సందర్భంగా గులాల్ విరజిమ్మిన నేపధ్యంలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బహుశా గులాల్‌లో రసాయనాలు ఉండటం వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు.
వెంటనే అక్కడున్న కొందరు భక్తులు ఈ సమాచారాన్ని ఫోనులో అగ్నిమాపక అధికారులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. దీనిపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఓ కమిటీ విచారణ చేయనుంది. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు.