Oommen Chandy Passes Away: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత.. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాందీ
అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాందీ తుదిశ్వాస విడిచారు.
Newdelhi, July 18: కేరళ మాజీ ముఖ్యమంత్రి (Kerala Ex CM), కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (Oommen Chandy) (79) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో (Health Issues) బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాందీ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు ధ్రువీకరించారు. చాందీకి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులు అర్పించారు.
వరుసగా 12 సార్లు
1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో ఊమెన్ చాందీ జన్మించారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా మారారు. 1970లో ఊమెన్ చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయనను సీఎం పీఠం దక్కింది.