Galwan Valley Clash: దొంగ నాటకమాడిన చైనా, గాల్వాన్ లోయ దాడిలో 38 మంది చైనా సైనికులు మృతి, సంచలన విషయాలను వెల్లడించిన ఆస్ట్రేలియా పరిశోధనాత్మక వార్తా పత్రిక
చైనా బ్లాగర్ల మధ్య జరిగిన చర్చలు, చైనా పౌరుల నుంచి సమీకరించిన సమాచారం, చైనా పత్రికలు ప్రచురించిన వార్తలు ఆధారంగా ఆస్ట్రేలియన్ పత్రిక ఈ కథనాన్ని రూపొందించింది
Galwan, Feb 3: గాల్వాన్ లోయ సమీపంలో 2020 జూన్ 15న ఇరు దేశ సైనికుల మధ్య ఘర్షణను (Galwan Valley Clash) చరిత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా చైనాకు ఇది ఎప్పటికీ జీర్ణించుకోలేని ఘటనగానే మిగిలిపోనుంది. ఎందుకంటే నాడు ఘర్షణకు చైనాయే కాలుదువ్వింది. ఇరు దేశ సైనికులు ఆయుధాలకు బదులు చేతులతో ముష్టి యుద్ధానికి (India-China Galwan valley clash) దిగడం తెలిసిందే. భారత్ 20 మంది సైనికుల ప్రాణాలను కోల్పోయింది. కానీ, చైనా మాత్రం ప్రాణ నష్టం వివరాలు బయటపెట్టలేదు. నలుగురు చనిపోయినట్టు ఆలస్యంగా 2021 ఫిబ్రవరిలో ప్రకటించింది.
భారత్ వైపు కంటే చైనా వైపే ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి. అయినా చైనా దీన్ని అంగీకరించలేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తా పత్రిక ఒకటి ఇందుకు సంబంధించి ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. చీకట్లో వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటే క్రమంలో కనీసం 38 మంది చైనా సైనికులు (38 Chinese soldiers drowned) మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
చైనా బ్లాగర్ల మధ్య జరిగిన చర్చలు, చైనా పౌరుల నుంచి సమీకరించిన సమాచారం, చైనా పత్రికలు ప్రచురించిన వార్తలు ఆధారంగా ఆస్ట్రేలియన్ పత్రిక ఈ కథనాన్ని రూపొందించింది. చైనా చెబుతున్నట్టు నాడు నలుగురు సైనికుల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఈ కథనంలో తెలిపింది.
లద్దాఖ్ ఈశాన్య ప్రాంతంలో 2020 మే 5న ప్యాంగాన్ లేక్ వద్ద ఇరు దేశాలు తమ బలగాలను మోహరించాయి. ఈ అంశంలో ఇరు పక్షాల మధ్య గోర్గాలో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తు తం లైన్ ఆఫ్ సెక్టార్ వద్ద ఇరు దేశాలకు చెందిన 50 వేల నుంచి 60 వేల బలగాలు మోహరించి ఉన్నాయి.