Goa Lockdown: ఈనెల 29 నుంచి మే 3వ తేదీ వరకూ రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్, కరోనా నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్న గోవా ప్రభుత్వం, గోవాలో ప్రతిరోజూ 2,000కు పైగా కోవిడ్ కేసులు నమోదు
గురువారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం వరకూ ఈ లాక్‌డౌన్ (Lockdown in Goa) అమలులో ఉంటుందని ప్రకటించింది.
Panaji, April 28: కరోనా నియంత్రణకు గోవా ప్రభుత్వం ఈనెల 29 నుంచి మే 3వ తేదీ వరకూ రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ను (Goa Lockdown) విధించింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం వరకూ ఈ లాక్‌డౌన్ (Lockdown in Goa) అమలులో ఉంటుందని ప్రకటించింది. అయితే, అత్యవసర సేవలు, వివిధ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
అదేవిధంగా అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. కానీ, ప్రజారవాణా మూతపడుతుందన్నారు. క్యాషినోలు, హోటళ్లు, పబ్‌లు కూడా మూసే ఉంటాయని చెప్పారు.ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సర్వీసులు, పరిశ్రమలు మూతపడవని చెప్పారు. కాగా గోవాలో ప్రతిరోజూ 2,000కు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.
రోజువారీ కార్మికులు దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, సోమవారం ఉదయం షట్‌డౌన్ ఎత్తివేస్తామని, యథా ప్రకారం వాణిజ్య కార్యక్రమాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ప్రజలు వైద్య చికిత్స తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడ వద్దని విజ్ఞప్తి చేశారు.
Here's ANI Updates:
కోవిడ్ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌ను ఇప్పటికే ప్రభుత్వం సవరించిందని, టెస్టింగ్ సమయంలోనే ఫలితాల కోసం వేచి చూడకుండానే మెడిసన్లు ఇస్తున్నామని, లాక్‌డౌన్ సమయంలోనూ వ్యాక్సినేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ముందస్తు అపాయింట్‌మెంట్‌తో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో కేసినోలు మూసే ఉంటాయని చెప్పారు.