Boat Accident Update: బోటు వెలికితీతలో ఫలిస్తున్న ప్రయత్నాలు, 40 అడుగుల లోతులో బోటు, పది మీటర్లు ఒడ్డు వైపుకు చేరితే బోటు బయటకు వచ్చినట్లే, ఆటంకం కలిగిస్తున్న వర్షం

బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది.

Godavari Boat Lost the Grip Of Anchors:Continues Rescue Operations (Photo-ANI)

East Godavari, October 19: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది. ఈ బోటును బయలకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం శత విధాల ప్రయత్నం చేస్తోంది. లంగరు, ఐరన్‌ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్‌ సాయంతో లాగారు. అయితే లంగరు బోటుకు తగులుకుని వెంటనే పట్టుజారిపోవడంతో బయటకు తీయడం ఆలస్యం అవుతోంది. కాగా బోటు వెలికితీతకు వర్షం అడ్డంకిగా మారింది. అయితే రెండు రోజుల కిందట బోటు వెలకితీత పనులను కాకినాడ పోర్టు అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం కూడా సహకరిస్తోంది. రెండు రోజులపాటు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పలుమార్లు లంగరు, ఐరన్‌ రోప్‌ బోటుకు తగులుకోవడంతో పట్టు జారిపోతోంది. అయితే లంగర్ , ఐరన్ రోప్ ల సహాయంతో బోటు ఉన్న ప్రాంతం నుండి మెల్లిగా దానిని ఒడ్డుకు లాక్కుంటూ వస్తున్నారు. ఇప్పటికే నది లోపల నుంచి సుమారు 70 అడుగుల మేర ఒడ్డు వైపునకు బోటు జరిగినట్లు పోర్టు అధికారి తెలిపారు.

లంగరు, రోప్‌ లాగుతున్న సమయంలో బోటు ఉన్న ప్రాంతంలో బుడగలతో కూడిన డీజిల్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దుర్వాసన వస్తోందని ఆయన తెలిపారు. బోటులో ఉన్న డిస్పోజబుల్‌ గ్లాసుల కట్ట ఒకటి శుక్రవారం పైకి తేలింది. ప్రస్తుతం బోటు 40 అడుగుల లోతులో, నది ఒడ్డు నుంచి సుమారు 250 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లు తెలిపారు. మరో పది మీటర్లు ఒడ్డు వైపు చేర్చగల్గితే బోటును సునాయాసంగా వెలికితీయవచ్చని వారు చెబుతున్నారు. లంగరు వేసిన ప్రతిసారి బోటు ఇంచుమించు పది నుంచి ఇరవై మీటర్లు మేర ముందుకు వస్తోందని, బోటు ఆపరేషన్‌లో జాప్యం జరుగుతోంది తప్ప, దానిని వెలికి తీయడం తథ్యమని ధర్మాడి సత్యం చెప్పారు. గత నెల కచ్చులూరు వద్ద బోటు మునిగి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

బోటు ప్రమాదంలో ఆచూకీ లేకుండా పోయిన వారు మృతి చెందినట్టుగానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.