Greta Thunberg 'Toolkit' Case: రైతుల ఉద్యమంలో హింస, బెంగళూరు మువతిని అరెస్ట్ చేసిన పోలీసులు, టూల్‌కిట్‌ను థన్‌బర్గ్‌కు పంపించింది దిశానే అన్న ఆరోపణలు
ఇందులో భాగంగా రైతుల ఆందోళనపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్‌లో ఉన్న టూల్‌కిట్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆదివారం బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువతి దిశా రవిని (Disha Ravi) అరెస్ట్ చేశారు.
New Delhi, February 14: దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనలో పోలీసులు (Greta Thunberg 'Toolkit' Case) మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా రైతుల ఆందోళనపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్‌లో ఉన్న టూల్‌కిట్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆదివారం బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువతి దిశా రవిని (Disha Ravi) అరెస్ట్ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ పర్యావరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్ చేశారు.
స్వీడన్‌కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ ప్రచారాన్ని ప్రారంభించిన వాళ్లలో ఈమె కూడా ఒకరు. ఆ టూల్‌కిట్‌ను థన్‌బర్గ్‌కు పంపించింది దిశానే అన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దేశంలో పెను ప్రకంపనలు రేపింది.
ఫిబ్రవరి 4న ఢిల్లీ పోలీసులు ఈ టూల్‌కిట్‌పై కేసు నమోదు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా అదే రోజు థన్‌బర్గ్ ఈ టూల్‌కిట్‌ను ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్‌తో రైతుల ఆందోళనకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు వెల్లువెత్తింది. హింసను ఉసిగొల్పే ఓ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ టూల్‌కిట్‌ను ఉంచినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీనికారణంగానే జనవరి 26న ఎర్రకోట హింసకు కుట్ర పన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇండియాపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ యుద్ధానికి పిలుపునిచ్చేలా ఇది ఉన్నదని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ వెల్లడించారు.
మరోవైపు గ్రేటా షేర్ చేసిన టూల్‌కిట్ ఖలికిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.