Gyanvapi Mosque Survey: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు, సర్వే కొనసాగించాలని తీర్పు, మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం
కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని మసీదు ఆవరణలో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది.
Prayagraj, August 3: జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక ఉత్తర్వులు వెలువరించింది. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని మసీదు ఆవరణలో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని తీర్పు వెలువరిస్తూ కోర్టు వ్యాఖ్యానించింది.
కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.
దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది.
వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది.