New Delhi, July 24: కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక ఉత్తర్వులు వెలువరించింది.వారణాసి కోర్టు (Varanasi Court) ఇచ్చిన ఈ సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. రెండు రోజుల పాటు అంటే జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది.
కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో ఇవాళ ఉదయం ఏడు గంటలకు శాస్త్రీయ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. సర్వే పేరుతో మసీదులో తవ్వకాలు జరిగే ప్రమాదం ఉందని జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో సర్వేకు కోర్టు బ్రేక్ వేసింది. అయితే సర్వే వల్ల మసీదుకు ఎటువంటి ప్రమాదం ఉండదని, మసీదులో ఉన్న ఒక్క ఇటుకను కూడా తీయలేదని, అలాంటి ఉద్దేశం కూడా లేదని కోర్టుకు కేంద్రం వెల్లడించింది. సర్వేలో భాగంగా మసీదును కొలతలు తీసుకోవడంతో పాటు ఫోటోగ్రఫీ, రేడార్ స్టడీ చేయనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
మసీదులో సర్వే కోసం జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నామని, అయితే ఈ కేసులో ముస్లిం కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీజే డీవై చంద్రచూడ్ తెలిపారు. జూలై 26వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. ముస్లిం వర్గం సమర్పించే అఫిడవిట్‌ను హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలని రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ముస్లిం గ్రూపు తరపు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మాది వాదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని, ఇప్పటికే మసీదులోని పశ్చిమ గోడను తొవ్వడం ప్రారంభించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.
మొగల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని కీలక తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది.