Haryana Violence: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఆగస్టు 2 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్, శివాలయంలో చిక్కుకుపోయిన 3 వేల మంది

దాంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారకుండా ఉండేందుకు అధికారులు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిషేధించారు.

Haryana Violence (Photo Credits: Twitter Video Grab)

Chandigarh, July 31: హర్యానాలోని నూహ్‌ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారకుండా ఉండేందుకు అధికారులు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిషేధించారు. ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటర్నెట్‌ సేవలపై ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సోషల్‌ మీడియా అసత్య ప్రచారం, పుకార్లు వెల్లువెత్తకుండా నూహ్‌ పట్టణ పరిధిలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు.అప్పటి పరిస్థితిని బట్టి ఇంటర్నెట్‌పై బ్యాన్‌ను మరింత పొడిగించే అవకాశం కూడా ఉన్నదని అధికారులు వెల్లడించారు.

గోవధ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఈ అంశాన్ని శాసనసభ ద్వారా పరిష్కరించుకోవాలని తీర్పు

ఇవాళ ఉదయం నూహ్‌ పట్టణంలో విశ్వహిందూ పరిషత్‌ (VHP) నిర్వహించిన ర్యాలీ ఘర్షణలకు కారణమైంది. వీహెచ్‌పీ ర్యాలీపై మరో వర్గం వాళ్లు రాళ్లు విసరారు. దాంతో వీహెచ్‌పీ కార్యకర్తలు కూడా వారిపై రాళ్ల దాడి చేశారు. ఇరువర్గాలు పోటీపడి కనిపించిన వాహనానికల్లా నిప్పుపెట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

విశ్వహిందూ పరిషత్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా హింస చేలరేగడంతో ఓ వర్గానికి చెందిన దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది స్థానికంగా ఉన్న నల్హార్‌ శివాలయంలో చిక్కుకున్నారని హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.

వారందరినీ కాపాడి ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని హోంమంత్రి చెప్పారు. హింసాత్మక ఘటనల్లో కొంతమందికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో పదుల సంఖ్యలో కార్లు, బైకులు తగులబడిపోయాయని ఆయన చెప్పారు. నూహ్‌లో పరిస్థితిని అదుపు చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.