Hathras Case: హత్రాస్ అత్యాచారం కేసు, అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు, దేశ రాజధానిలోని కోర్టుకి మార్చాలనే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు
తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు (Allahabad High Court) పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.
Lucknow, Oct 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ కేసు (Hathras Case) దర్యాప్తును యూపీ ప్రభుత్వం సీబీఐకి (CBI investigation)అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు (Allahabad High Court) పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.
కేసును ఢిల్లీకి బదిలీ చేయడాన్ని తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బొబ్డే (Chief Justice S A Bobde) నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిన తరువాత కేసు బదిలీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సీబీఐ తన స్థితి నివేదికను ఇకపై అలహాబాద్ హైకోర్టుకు సమర్పించనున్నది. ఈ కేసుకు సంబంధించిన అంశాలు, బాధితురాలి కుటుంబం, సాక్షుల భద్రతను అలహాబాద్ హైకోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
19 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న హత్రాస్‌లో నలుగురు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. పోలీసులు బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో అక్టోబర్ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు.
ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం కోరిన వివరాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి చెందిన న్యాయవాది సీమా కుష్వాహా, న్యాయవాది ఇందిరా జై సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే బాధితురాలు కుటుంబంతోపాటు సాక్షులకు యూపీ ప్రభుత్వం మూడు స్థాయిల రక్షణ కల్పించింది. సాక్షులు, బాధితుల ఇండ్లలో సీసీటీవీలను ఏర్పాటుచేశారు. పోలీసులు బ్లాక్ వద్ద, ఇంటి వెలుపల కాపలాగా ఉన్నారు. ఇది కాకుండా సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.