New Delhi, October 1: హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ జిల్లాలో ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు కామాంధులు పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆ రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరింత చర్చనీయాంశం అవుతోంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఎక్కడా ధృవీకరించబడలేదని హాథ్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ వ్యాఖ్యలు చేయడం మరింత దుమారాని దారితీసింది. కాగా, గురువారం పోస్ట్ మార్టం నివేదిక విడుదలైంది. బాధితురాలిపై అత్యాచారం అత్యాచారం జరిగినట్లు ధృవీకరించింది. అంతేకాకుండా మెడ భాగంలో గట్టిగా నొక్కినట్లుగా నిర్ధారణ అయింది. బాధితురాలిని శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడం ద్వారా శరీరంలోని చాలా భాగాల్లో గాయాలైనట్లు నివేదిక వెల్లడించింది.
ఏకంగా ప్రధాన మంత్రే ఈ ఘటనపై ఆరా తీయడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఈ కేసును దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని బాధితురాలి కుటుంబ సభ్యులకు సీఎం తెలియజేశారు. మరోవైపు ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా బలవంతంగా యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేయడం అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కలిసి గురువారం హాథ్రస్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హాథ్రస్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు, జిల్లా సరిహద్దులను మూసివేశారు.
గత నెల సెప్టెంబర్ 14న హాథ్రస్ జిల్లాలోని తమ గ్రామంలో 19 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి పొలం పనులు చేసుకుంటుండగా నలుగురు దుండగులు ఆమెను అపహరించుకుపోయారు. ఆ నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా హింసిస్తూ రాక్షసంగా ప్రవర్తించారు. యువతి నాలుకను కూడా కోసేశారు. నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ 22న ఆ యువతి ఒళ్లంతా రక్తంతో కూడిన స్థితిలో కనుగొన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత అలీఘర్ నెహ్రూ హాస్పిటల్ కు తరలిచారు, అయితే మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది.