Heavy Rains: రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, భారీ వర్షాలకు వణుకుతున్న 4 రాష్ట్రాలు, కేరళలో 8 మంది మృతి, హైదరాబాద్‌పై విరుచుకుపడిన వరదలు
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది.
Hyd, Oct 17: భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో నగరం వర్షంతో (Heavy Rains lash several parts) తడిసిముద్దయ్యింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పల్, అంబర్‌పేట్, రామంతపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురవడంతో ఆయా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని చైతన్యపురి కాలనీ నీట మునిగింది రహదారులు చెరువుల్లా మారడంతో చాలాచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
జోరువాన, వరదలతో మ్యాన్ హోళ్లు పొంగుతున్నాయి. వర్షాలు, వరదలపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సూచించారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అల్లాడుతున్నారు. గ్రేటర్‌లో వర్షాలకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో అత్యధికంగా ఎల్బీనగర్‌లో 10.6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
అంబర్‌పేటలో 10.4, ఉప్పల్‌లో 10.2, షాబాద్‌లో 9.6, సింగపూర్ టౌన్‌షిప్‌లో 9.1, హిమాయత్‌నగర్‌లో 8.1, మలక్‌పేటలో 7.2, చర్లపల్లిలో 7.8, నాచారంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కందువాడలో 8.7, కందువాడలో 8.7, ఆరుట్లలో 7, సూర్యాపేట జిల్లా నాగారంలో 9.5, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 8.9, జడ్చర్లలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయింది. అలాగే జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 7.6, కోరుట్లలో 6.9, వరంగల్ మంగళవారిపేటలో 7, యాదాద్రి జిల్లా తుఫ్రాన్‌పేటలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శనివారం ఉదయం వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగడంతో ఎడ్లబండి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందాయి. ఎడ్లబండిలో ఉన్న రైతు అతికష్టంపై బయటపడ్డాడు. జన్నారం గ్రామానికి చెందిన అన్వర్ రోజులాగే శనివారం తన ఎడ్లబండితో జన్నారం వాగు దాటి పొలానికి వెళ్లాడు. కాగా శుక్రవారం రాత్రి నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకు జన్నారం వాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది.
పొలం పని ముగించుకున్న అన్వర్ వాగు దాటుతుండగా ఎడ్లబండితో పాటు రెండు కాడెడ్లు కొట్టుకుపోయాయి. అన్వర్ వాగు ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయాడు. వాగు ఒడ్డు పట్టు దొరకడంతో అతికష్టంపై పైకి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతిచెందాయి. రెండు నెలల క్రితమే ఎడ్లను రూ. 80 వేలకు కొనుగోలు చేశానని బాధిత రైతు కంట తడిపెట్టాడు.
జడ్చర్ల పట్టణంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని నల్లకుంట ప్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కట్ట తెగిపోయి.. పట్టణ ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరగా.. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాల్మీకినగర్‌లో నీటి ఉధృతికి నాలాలో పట్టణానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.
వెంటనే గమనించిన స్థానికులు రాఘవేందర్‌ను నాలా నుంచి వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాఘవేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో నీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అయితే, పట్టణంలో వరద నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేరళలోని పలు జిల్లాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు (Heavy Rains Lash Kerala) కురుస్తున్నాయి. కొట్టాయం గ్రామీణ ప్రాంతంలో భారీ వానలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఒక కారు కొట్టుకుపోతుండగా, నడుంలోతు నీటిలో దిగిన స్థానికులు తాడు సహాయంతో ఆ కారును పక్కకు లాగారు. అలాగే పూంజార్‌లో కేఎస్‌ఆర్టీసీ బస్సు వర్షం నీటిలో చిక్కుకున్నది. దీంతో అందులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, తిరువనంతపురం, కొల్లామ్, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరో రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ప్రజలు అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావద్దని, కొండలు, నదీ ప్రవాహాల వద్ద వాహన ప్రయాణాలు వద్దని సీఎం విజయన్ సూచించారు. ఇప్పటివరకు 8 మంది మరణించగా 8 మంది మిస్సయ్యారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం దక్షిణ, మధ్య ప్రాంత జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉన్నాయని, సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో కూడా తీవ్రతరం కావొచ్చని ఆయన తెలిపారు.
శనివారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వేటపై అధికారులు నిషేధం విధించారు. అల్పపీడనం ప్రభావంతో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.