No Power Outage in AP: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, ఏపీలో ఎటువంటి విద్యుత్‌ కోతలు ఉండవని తెలిపిన ప్రభుత్వం, బొగ్గు కొనుగోలుకు భారీగా నిధులు ఇచ్చిన జగన్ సర్కారు
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 16: ఏపీలో విద్యుత్‌ కోతలపై తప్పుడు ప్రచారాన్ని ఇంధన శాఖ ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని (Fake Rumors on Power Outage) ఇంధన శాఖ అధికారులు తప్పుబట్టారు. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా (No Power Outage in AP) చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశించారు.

బొగ్గు కొనుగోలు నిమిత్తం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్లు నిధులు, రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించింది. స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి కేటాయించబడని వాటా నుంచి సమీకరణ యత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది.​ వచ్చే ఏడాది జూన్‌ వరకు 400 మెగావాట్ల విద్యుత్‌ కోసం కేంద్రాన్ని అభ్యర్థించింది.

అల్పపీడనం దెబ్బ, గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని బొగ్గు సరఫరా కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటీపీఎస్‌, కృష్ణపట్నంలోనూ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేశారు.

రూమర్లపై స్పందించిన మంత్రి బాలినేని

ఏపీలో విద్యుత్ కోతలకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పందించింది. విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రూమర్లపై స్పందించారు. విపక్షాలు ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కోతలకు అసలు కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో బొగ్గు కొరత వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని, అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని బాలినేని భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.

ముంచుకొస్తున్న జవాద్ తుఫాన్ ముప్పు, తెలంగాణలో వేగంగా వెనుదిరుగుతున్న నైరుతి రుతుపవనాలు, ఈ సారి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడనున్న సైక్లోన్ జవాద్

విద్యుత్ కోతలపై రాష్ట్రంలో విపక్షాలు బురదజల్లుతున్నాయని మంత్రి బాలినేని తెలిపారు. ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకుని టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన ఆరోపించారు. రూ.కోట్లు తీసుకుని ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారని గత టీడీపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. తక్కువ ధరకు విద్యుత్ కొందామంటే కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని : మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని విధాలా బ్రష్టు పట్టించాడని ఆయన ధ్వజమెత్తారు. సోలార్ పవర్‌ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని విమర్శించారు.

ఏపీలో తాజాగా బొగ్గు సంక్షోభం నేపథ్యంలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వం.. త్వరలో అధికారిక విద్యుత్ కోతలు విధించాల్సి రావొచ్చని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విద్యుత్ కోతలపై పుకార్లు మొదలయ్యాయి. వీటిపై ఇవాళ స్పందించిన ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వస్తున్న పుకార్లను ఖండిస్తూ ఇంధన శాఖతో పాటు ఈపీడీసీఎల్ అధికారులు కూడా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో ప్రజల్లో అనుమానాల్ని తొలగించే ప్రయత్నం చేశారు.