Heavy rains. (Photo Credits: PTI)

Amaravati, Oct 15: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు ( IMD predicts heavy rainfall ) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్లు వంగి ఉంది. అలాగే తూర్పు–పడమర ద్రోణి సగటు సముద్రమట్టం కంటే 4.5, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు అల్పపీడనానికి సంబంధించి ఉపరితల ఆవర్తనం గుండా వెళుతోంది. ఇది లక్షద్వీప్‌ ప్రాంతం, ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగంలో ఉన్న ఇతర అల్పపీడనం ప్రాంతంతో సంబంధం కలిగి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు.

ముంచుకొస్తున్న జవాద్ తుఫాన్ ముప్పు, తెలంగాణలో వేగంగా వెనుదిరుగుతున్న నైరుతి రుతుపవనాలు, ఈ సారి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడనున్న సైక్లోన్ జవాద్

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక అక్టోబర్ 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రానున్న మూడు గంటల్లో కేరళలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కేరళలో భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపత్యంలో కొండ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణం పరిమితం చేయబడింది. సహాయక కార్యక్రమాల నిమిత్తం 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించబడ్డాయి.

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో రెండు రోజులు తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నందున, కేరళలో భారీ వర్షం కొనసాగుతుంది. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాలకు రాత్రి సమయంలో ప్రయాణాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రయాణ నిషేధం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది.