CJs Reshuffle: ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌ల బదిలీ, ఏపీ హైకోర్ట్ సీజే సిక్కిం హైకోర్టుకు బదిలీ, తెలంగాణ హైకోర్ట్ సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ పేరు ప్రతిపాదన

సోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయవ్యవస్థను దుర్భాషలాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన సమయంలో, హైకోర్టు యొక్క తటస్థతను పునరుద్ధరించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం సీజే ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు....

File image of High Court of Andhra Pradesh | File Photo

Hyderabad/Amaravati, December 16:  ఒకేసారి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్ట్ కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని ముగ్గురు సభ్యుల న్యాయమూర్తుల బెంచ్ కలిగిన సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ బొబ్డే నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. అదే సమయంలో సిక్కిం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎ.కె గోస్వామిని ఏపి హైకోర్ట్ సీజేగా బదిలీ చేస్తూ సిఫార్సు చేశారు.

ఒకవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏపి హైకోర్ట్ విధానాలుంటున్నాయని వైసీపీ నేతల పరోక్ష ఆరోపణలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయవ్యవస్థను దుర్భాషలాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన సమయంలో, హైకోర్టు యొక్క తటస్థతను పునరుద్ధరించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం సీజే ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో హైకోర్ట్ న్యాయమూర్తుల బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ఇంకోవైపు, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి బదిలీ కూడా జరగనుంది. జస్టిస్ రవి మాలిమత్ సీజెగా వ్యవహరిస్తున్న ఉత్తరాఖండ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుత తెలంగాణ హైకోర్ట్ సీజే ఆర్.ఎస్ చౌహాన్‌ను బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించింది. అలాగే దిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందుతున్నట్లు సమాచారం. ఇది జరిగితే, తెలంగాణ హైకోర్ట్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ రికార్డులకెక్కుతారు.

న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులపై సుప్రీం కొలీజియం నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారిక ఉత్తర్వులేమి వెలువడలేదు. న్యాయమూర్తుల మార్పులను సుప్రీం కొలీజియం ధృవీకరించి న్యాయశాఖకు పంపిస్తే, న్యాయశాఖ పరిశీలానంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నుంచి తెలగు రాష్ట్రాల న్యాయమూర్తుల మార్పులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.