Division of AP Bhavan: ఏపీ భవన్ విభజన, ఆంధ్రప్రదేశ్‌కు 12.09 ఎకరాలు, తెలంగాణకు 7.64 ఎకరాలు, తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చిన కేంద్రం
ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దీనికి సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.
New Delhi, May 4: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దీనికి సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్–డీలో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది.
జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్–ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అని ప్రతిపాదించింది.
కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.