ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు వీడలేదు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6, ఇరగవరంలో 32.2, ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అనంతపురం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని 5 మండలాల పరిధిలో వర్షం కురిసింది.