COVID-19 Alert: మహారాష్ట్ర నుంచి తరలి వెళ్తున్న వారికి టెస్టుల్లో కరోనా పాజిటివ్, నాందేడ్ నుంచి వచ్చిన 137 యాత్రికులకు పాజిటివ్ రిజల్ట్స్, యూపీ వెళ్లిన ఏడుగురు కూలీలకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ

కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలను పూర్తిగా నిషేధించింది....

Coronavirus lockdown in India. | (Photo Credits: PTI)

New Delhi, May 2: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. అయితే ఈ లాక్డౌన్ విధించి నెల రోజులకు పైబడి కావడంతో కేంద్ర ప్రభుత్వం కొద్దికొద్దిగా సడలింపులు ప్రకటిస్తూ వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రాలకు తరలించేందుకు అనుమతిస్తూ ప్రత్యేకంగా బస్సులను, శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొంతమందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.

మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో హుజూర్ సాహెబ్ గురుద్వార్ సందర్శనకు పంజాబ్ నుంచి వచ్చిన సుమారు 4 వేల మంది యాత్రికులు లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరందరినీ మహారాష్ట్ర ప్రభుత్వం తమ సొంత రాష్ట్రానికి తరలించగా అందులో 137 మందికి పైగా పాజిటివ్ గా నిర్ధారించబడింది. ఫలితంగా పంజాబ్ రాష్ట్రంలో కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఈ విధంగా ఎక్కువవుతున్నాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ వాళ్లకు చాలా రోజులుగా పరీక్షలు జరపకుండా మహారాష్ట్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమకు చెబితే తమ రాష్ట్రం నుంచైనా అధికారులను పంపేవాళ్లమని అసహనం వ్యక్తం చేసింది. కనీసం తరలించేటపుడు కూడా సరిగా స్క్రీనింగ్ చేయలదని విమర్శించింది.

అయితే మహారాష్ట్ర అధికార వర్గాలు పంజాబ్ వాదనను తిప్పికొట్టాయి. తమ దగ్గర బయలుదేరేటపుడు వారెవరికీ లక్షణాలు కనపడలేదని, ప్రయాణంలో వారికి వైరస్ సోకి ఉండవచ్చునని బదులిచ్చి చేతులు దులుపుకుంది.

మరోవైపు, మహారాష్ట్ర నుంచి ఉత్తర్ ప్రదేశ్ తిరిగొచ్చిన 7గురు వలస కూలీలకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి రాకముందే మహా సర్కార్ వీరిని యూపీ తరలించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దేశం అంతా ఒక ఎత్తైతే, ఒక్క మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులు మరో ఎత్తు. దేశంలో కేసులు 37 వేలు దాటితే అందులో సుమారు 12 వేలు మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన వారిని తమ రాష్ట్రం నుంచి వీలైనంత త్వరగా పంపేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్19 పరిస్థితిని గమనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలను పూర్తిగా నిషేధించింది. రాష్ట్ర సరిహద్దుల వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. కనీసం అత్యవసర సేవలకు కూడా రాష్ట్రం దాటి వెళ్లేందుకు వీల్లేకుండా అనుమతులను నిరాకరించింది.