OBC Certificate Cancelled in West Bengal: కలకత్తా హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ రియాక్షన్, రాజ్యాంగానికి లోబడి అసెంబ్లీలో చట్టం చేశాం, తీర్పుపై అసంతృప్తి
దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ‘‘ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది
Kolkata, May 22: పశ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను (OBC Certificates) తోసిపుచ్చుతూ కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఓబీసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ జస్టిస్ తపబ్రత చక్తవర్తి, రాజశేఖర్ మంథాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ కమిషన్ ఓబీసీల తాజా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తర్వాత తయారుచేసిన ఓబీసీ జాబితా చట్టవిరుద్ధమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం, 2012లోని సెక్షన్ 2హెచ్, 5,6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగవిరుద్ధమని కొట్టివేసింది.
2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు అన్నీ 1993 (BC Commission) చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన సర్టిఫికెట్లు వారికి లభించలేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. కాగా, 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లపై తీర్పు ప్రభావం ఉండదు.
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసంతృప్తి వ్యక్తంచేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ‘‘ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇప్పుడు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరింబోం. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి’’ అని దీదీ స్పష్టంచేశారు.