IAS vs IPS in Karnataka: కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వ్యక్తిగత వార్, అసలెక్కడ ఈ వార్ మొదలైంది, ఇద్దరిపై సీఎం బసవరాజ్ బొమ్మై తీసుకున్న చర్యలు ఏమిటి
ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి వర్సెస్ ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ మధ్య వార్ బసవరాజ్ బొమ్మై( Basavaraj Bommai) ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
Bengaluru, February 20: కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి వర్సెస్ ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ మధ్య వార్ బసవరాజ్ బొమ్మై( Basavaraj Bommai) ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వివాదానికి కారణం ఏంటంటే.. ఆదివారం ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి(Rohini Sindhuri)కి చెందిన వ్యక్తిగత ఫొటోలను ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్(Roopa Moudgil) సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫొటోలనే గతంలో రోహిణి మగ ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ట్వీట్‌లో ఆరోపించారు.
ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆమె మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారంటూ ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి అవినీతి ఆరోపణలు చేశారు ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్. దీనిపై తాను ముఖ్యమంత్రి బొమ్మై( Basavaraj Bommai), ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.
ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారిని వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. రూపా(Roopa Moudgil) తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని..ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌షాట్లను సేకరించారని మండిపడ్డారు. నేను ఎవరికి పంపానో ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై.. బహిరంగ తగాదాలకు పాల్పడినందుకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. "ఇద్దరు అధికారుల మధ్య బహిరంగ వాగ్వాదం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యాన్ని మేము సహించలేము. ఇద్దరికీ నోటీసులు జారీ చేయాలని నేను ప్రధాన కార్యదర్శిని కోరాను" అని సీఎం చెప్పారు.
ఇద్దరు అధికారిణులు ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ‘వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరు సామాన్య వ్యక్తులు కూడా బహిరంగంగా ఇలా విమర్శించుకోరు. వారికి వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా.. మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని కర్ణాటక హోంమంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం, పోలీసు చీఫ్‌తో చర్చించినట్లు చెప్పారు.
ప్రస్తుతం రూప.. కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో ఒక రెస్టారెంట్‌లో సింధూరి(Rohini Sindhuri) దిగిన చిత్రం వైరల్ అయింది. ఒక ఐఏఎస్ అధికారిణికి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం ఏముందని ఆ సమయంలో రూప ప్రశ్నించారు. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఘర్షణ నేపథ్యంలో రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి బెంగళూరులోని బాగలగుంటె పోలీసులకు ఐపీఎస్ అధికారిణి డి.రూపపై ఫిర్యాదు చేశారు.రూపపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. "ఈ రూప ఎవరు? రోహిణి సింధూరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె వ్యక్తిగత అజెండా ఏమిటి? అది బయటకు రావాలి.
రూప మానసిక సవాళ్లను ఎదుర్కొంటుంది. రూపా వ్యక్తిగత ఫోటోలు ముగ్గురికి ఐఏఎస్ ఆఫీసర్లు పంపినట్లు ఆరోపించింది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు పెట్టనివ్వండి.. రోహిణి సింధూరి ఫొటోలను ఆమె ఎందుకు వైరల్ చేసింది?.. మేం అవి ఎవరికీ పంపలేదు.. ఆమె ఎలా తెచ్చుకుంది?.. నేను కర్నాటకకు చెందినవాడిని.. ఇక్కడే పుట్టాను.. ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు పెట్టనివ్వండని రోహిణి భర్త మండిపడ్డారు. తన కంటే 10 ఏళ్ల చిన్న అధికారి ఇంత మంచి పేరు సంపాదించడాన్ని ఆమె అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. సీనియర్ అధికారులు రోహిణి సింధూరిని అభినందించారు. ఆమే షేర్ చేసినవన్నీ పాత ఫోటోలే అని ఆయన అన్నారు.
రోహిణి సింధూరితో సంబంధం ఉందని ఆరోపిస్తున్న దివంగత సీనియర్ ఐఏఎస్ అధికారి డీకే రవి గురించి మాట్లాడుతూ, రవి ఇప్పుడు ఇక్కడ లేరు అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. నేనెప్పుడూ మీడియా ముందుకు రాలేదు.. ఇది వ్యక్తిగతం కావడం వల్ల నేను రంగంలోకి దిగుతున్నానని ఆయన అన్నారు.