LPG Price Hiked: పెరిగిన వంటగ్యాస్ ధరలు, ఒక్కో ఇండేన్ గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 144.50 పెంపు, పెరిగిన ధరలు నేటి నుంచే అమలు

సబ్సిడీని పెద్దమొత్తంలో పెంచుతున్నందున వాటి అనుమతుల కోసం కొంత ఆలస్యం జరిగిందని అధికారులు చెప్పారు. అయితే....

LPG Cylinders | Representative Image | (Photo Credits: ANI)

Delhi, February 12:  మెట్రో నగరాలలో సబ్సిడీయేతర (non-subsidised) వంటగ్యాస్ (LPG) సిలిండర్ల ధరలు పెరిగాయి. 14.2 కిలోల ఇండేన్ గ్యాస్ సిలిండర్‌పై ఒక్కసారిగా రూ. 144.50 పెంచారు. దీంతో ప్రస్తుతం రూ. 714 గా ఉన్న ధర, రూ. 858.50 కు పెరిగింది. ఈ పెరిగిన ధరలు (Price Hike) నేటి నుంచే అమలులోకి రానున్నాయి.

కాగా, సిలిండర్ల ధరల పెరుగుదలతో పాటే అదే క్రమంలో కేంద్రప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా రెట్టింపు చేయడం గమనార్హం. గృహ వినియోగదారులకు ఒక సిలిండర్‌పై లభించే రాయితీని రూ. 153.86 నుంచి రూ. 291.48 కు పెంచారు.

ఇక ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌పై లభించే రాయితీ కూడా రూ. 174.86 నుంచి రూ. 312.48 కు పెరిగింది.

ఎల్‌పిజి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయబడే ఈ సబ్సిడీని పరిగణలోకి తీసుకుంటే, గృహ వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ. 567.02 కాగా, పిఎంయువై వినియోగదారులకు రూ. 546.02 ఖర్చవుతుంది.

Check ANI's Update:

గృహాల్లో, వంటశాలల్లో పర్యావరణ హితమైన ఇంధనం ఉపయోగించడాన్ని పెంచేలా పిఎంయువై పథకం కింద పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల ఉచిత ఎల్పిజి కనెక్షన్లను ఇచ్చింది.

సాధారణంగా, ఎల్‌పిజి రేట్లు ప్రతి నెల 1వ తేదీన సవరించబడతాయి, అయితే ఈసారి సమీక్ష జరగడానికి ఓ రెండు వారాలు ఆలస్యమైంది. సబ్సిడీని పెద్దమొత్తంలో పెంచుతున్నందున వాటి అనుమతుల కోసం కొంత ఆలస్యం జరిగిందని అధికారులు చెప్పారు. అయితే మధ్యలో ఫిబ్రవరి 08న దిల్లీ ఎన్నికలు రావడం వల్ల, ఎల్పీజీ ధరల పెరుగుదలను ఆలస్యం చేశారని విమర్శలు వస్తున్నాయి.