COVID-19 in India: భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారి
కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ ఈ సమావేశాలకు హాజరైన వారితోనే లింక్ ఉన్నట్లుగా తేలుతుంది.....
New Delhi, April 1: భారతదేశంలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య (COVID-19 Deaths in India) బుధవారం ఉదయం నాటికి 47కు చేరుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణంలో ఒక 65 ఏళ్ల వ్యక్తి బుధవారం చికిత్స పొందుతూ మరణించాడు. ఇండోర్ (Indore) పట్టణం మధ్యప్రదేశ్ యొక్క కరోనావైరస్ హాట్‌స్పాట్‌గా మారిందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మొత్తం 86 కేసులు నమోదు కాగా ఇందులో ఇండోర్ నుంచే 63 కేసులు ఉండటం గమనార్హం. ఈరోజు మధ్య ప్రదేశ్ లో 20 కేసులు నమోదు కాగా, ఇండోర్ పట్టణం నుంచే 19 కేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 5 గురు చనిపోయారు, అందులో కూడా ముగ్గురు ఇండోర్ నుంచే ఉన్నారు.
మధ్య ప్రదేశ్ లో ఇండోర్ తర్వాత జబల్పూర్‌లో 8 కేసులు, ఉజ్జయినిలో -6, భోపాల్ నుంచి 4, శివపురి, గ్వాలియర్ నుంచి రెండు చొప్పున 4, ఖార్గోన్ లో 1 కేసులు నమోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం నాటికి నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య 1,637 కు చేరుకుంది. గత 12 గంటల్లో దేశవ్యాప్తంగా 240 కొత్త కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (Andhra Pradesh) మొత్తం కేసుల సంఖ్య 87కు చేరుకుంది.
Here's the update by PTI
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ (Nizamuddin Markaz) లో తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి ద్వారా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ ఈ సమావేశాలకు హాజరైన వారితోనే లింక్ ఉన్నట్లుగా తేలుతుంది.
దిల్లీతో లింక్ ఉన్న 15 మందికి తెలంగాణలో మంగళవారం పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 97కు చేరుకున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలో ఉంది. బుధవారం వెలువరించిన బులెటిన్ ప్రకారం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 320కు చేరింది. ఆ తర్వాత కేరళలో 241 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనావైరస్ బారి నుంచి ఇప్పటివరకు 124 మంది కోలుకున్నారు.